సక్సెస్‌కి ఒక ఫార్ములా అంటూ లేని ఇండస్ట్రీ ఏదైనా ఉందీ అంటే అది సినిమా ఇండస్ట్రీ మాత్రమే. ఫలానా ఫార్ములాతో సినిమా చేస్తే డెఫినెట్‌గా సూపర్‌హిట్ అవుతుంది అని చెప్పేవారు ఇప్పటివరకు లేరు. మరికొందరి మాటల్లో చెప్పాలంటే.. సినిమా అనేది ఒక జూదం లాంటిది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది అనే నమ్మకంతో సినిమా తీస్తే డిజాస్టర్ అవుతుంది, ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది. సినిమా రంగంలో ఉన్న స్పెషల్ ఫార్ములా ఇది. ఇప్పుడీ స్పెషల్ ఫార్ములాతో వచ్చిన ‘స్త్రీ2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు, కొత్త రికార్డులు సృష్టిస్తోంది. బాలీవుడ్ సినీ ప్రముఖులు ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. అనూహ్యమైన ఈ ఘన విజయాన్ని చూసి బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఇంతటి ఘనవిజయం ఆ సినిమాకి ఎలా దక్కింది అని తలలు పట్టుకుంటున్నారు.
సినిమా రిలీజ్‌కి వారం ముందే ‘స్తీ2’ ప్రభంజనం మొదలైంది. ఎలాగంటే.. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే ఎవ్వరూ ఊహించని విధంగా టికెట్స్ సేల్ అవుతూ వచ్చాయి. సినిమా రిలీజ్ సమయానికి కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రూ.54 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు ఇండియాలో ఇలాంటి ఓపెనింగ్ బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలకు కూడా రాలేదు. ఆగస్ట్ 15న ‘స్త్రీ2’ రిలీజ్ అయింది. అదే రోజు విడుదలైన అక్షయ్‌కుమార్ సినిమా ‘ఖేల్ ఖేల్ మే’ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కేవలం రూ.5 కోట్లు మాత్రమే వచ్చింది. మరో విశేషం ఏమిటంటే ‘స్త్రీ2’ చిత్రంలో అక్షయ్‌కుమార్ గెస్ట్‌గా కనిపించాడు.
‘స్త్రీ2’ రిలీజ్ అయిన రోజు మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై 10 రోజులైంది. ఈ పది రోజుల్లో రూ.500 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. రూ.60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 500 కోట్ల క్లబ్లో సునాయాసంగా చేరిపోయింది. ఈ సినిమా రిలీజైన అన్ని థియేటర్లు ఇప్పటికీ 90 పర్సెంట్ ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి. దేశంలోని పలు భాషల్లో విడుదలైన ‘స్త్రీ2’ ప్రతిచోటా తన సత్తా చాటుతోంది. ఈ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి ముఖ్య కారణం రిలీజ్‌కి ముందు విడుదల చేసిన ట్రైలర్. ఇది అందర్నీ ఆకట్టుకుంది. నెలరోజుల్లోనే దాదాపు 50 మిలియన్ వ్యూస్ రాబట్టడం ద్వారా జనంలోకి దూసుకెళ్లింది. దానితోపాటు తమన్నా చేసిన స్పెషల్ సాంగ్‌కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట కూడా నెల రోజుల వ్యవధిలో 145 మిలియన్ వ్యూస్ సాధించడం సినిమాకి బాగా ప్లస్ అయింది.
ఇప్పటివరకు సౌత్లోగానీ, నార్త్లోగానీ ఎన్నో హారర్ మూవీస్ వచ్చాయి. వాటిలో కొన్ని హారర్‌తో కామెడీ కూడా మిక్స్ అయిన సినిమాలు ఉన్నాయి. ఆ తరహాలోనే ‘స్త్రీ2’ కూడా రూపొందింది. ఈ సినిమా కాన్సెప్ట్, మేకింగ్, టేకింగ్, టెక్నికల్ స్టాండర్డ్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్, శ్రద్ధా కపూర్, రాజ్కుమార్రావ్లతోపాటు మిగతా నటీనటుల పెర్పార్మెన్స్ పీక్స్‌లో ఉండడం సినిమాకి సహజంగానే ప్లస్ అయింది. దానికితోడు ట్రైలర్, స్పెషల్ సాంగ్ ప్రమోషన్‌తో ‘స్త్రీ2’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి హ్యూజ్ కలెక్షన్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది. మరి ఈ సినిమా రన్ ఎంతకాలం కొనసాగుతుందో, ఫుల్ రన్లో కలెక్షన్లపరంగా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.